వరంగల్‌లో బీజేపీతో బిఆర్ఎస్ దోస్తీ ఎందుకంటే...

బీజేపీని కేసీఆర్‌ ఎంతగా వ్యతిరేకిస్తారో అందరికీ తెలుసు అలాగే అవసరార్ధం అదే పార్టీతో చేతులు కలిపేందుకు కూడా వెనకాడరని తెలియజేస్తున్నారు వరంగల్‌ బిఆర్ఎస్ పార్టీ నేతలు. వరంగల్‌ మేయర్‌గా ఉన్న గుండు సుధారాణి ఇటీవలే బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆమెతో పాటు కొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. దీంతో ఆమెను మేయర్ పదవి నుంచి గద్దె దించేందుకు వరంగల్‌ బిఆర్ఎస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారు. 

వరంగల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 66 మంది కార్పొరేటర్లు ఉన్నందున అధికార పీఠం దక్కించుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ 34. కానీ బిఆర్ఎస్ పార్టీ వద్ద 22 మంది కార్పొరేటర్లే మిగిలారు. బీజేపీ వద్ద 10 మంది ఉన్నందున వారి సాయంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్దం అవుతోంది.

కానీ మరో ఇద్దరు కార్పొరేటర్లు తక్కువ పడటంతో కాంగ్రెస్‌లోకి వెళ్ళిన బిఆర్ఎస్ కార్పొరేటర్లను వెనక్కు రప్పించేందుకు బిఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ రప్పించగలిగితే మేయర్‌కి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఆమోదింపజేసుకొని గద్దె దించవచ్చు.

బీజేపీపై కత్తులు నూరుతూ మళ్ళీ అదే బీజేపీతో బిఆర్ఎస్ పార్టీ చేతులు కలపడాన్ని ఏమనుకోవాలి?