జూలై 17 నుంచి పంట రుణాల మాఫీ షురూ?

ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం ఎంత కష్టమో, వచ్చేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడం అంతా కంటే కష్టమని తెలంగాణ ప్రభుత్వ పరిస్థితి చూస్తే అర్దమవుతుంది.

ఇప్పటికే మహాలక్ష్మి వంటి కొన్ని హామీలను అమలుచేసినప్పటికీ, పింఛన్ల పెంపు, పంట రుణాల మాఫీ వంటి అనేక హామీలు అమలుచేయాల్సి ఉంది. వీటి కోసం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండటంతో జవాబు చెప్పుకోలేక ఇబ్బంది పడుతోంది. 

లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆగస్ట్ 15వ తేదీలోగా రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామంటూ సిఎం రేవంత్‌ రెడ్డి దేవుళ్ళపై ఓట్లు వేసి మరీ చెప్పారు. ఈ హామీ అమలుకు తనకు తానే డెడ్‌లైన్‌ విధించుకున్నారు కనుక ఆలోగా ఎట్టి పరిస్థితులలో ఆ హామీని అమలు చేయక తప్పదు. 

ఇప్పటికే ప్రభుత్వం దీనిపై అవసరమైన కసరత్తు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం వచ్చే నెల 17వ తేదీ నుంచి ఈ పంట రుణాల మాఫీ పధకంలో భాగంగా అర్హులైన రైతుల ఖాతాలలో డబ్బు జమా చేయడం ప్రారంభించి, సిఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చిన్నట్లు ఆగస్ట్ 15లోగా ఈ ప్రక్రియని పూర్తి చేయాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకొని మార్గదర్శకాలు విడుదల చేస్తూ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.