కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలలో మరోసారి ఘోర పరాజయం పాలవడంతో ఆయన పార్టీ పగ్గాలను హరీష్ రావుకి అప్పగించాలని ఆలోచనలు చేస్తున్నట్లు లేదా కేటీఆర్‌ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించి హరీష్ రావుని నియమించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వీటిపై హరీష్ రావు ఘాటుగా స్పందిస్తూ, “నన్ను, నా విశ్వసనీయతని, నా పార్టీని దెబ్బ తీసేవిదంగా మీడియాలో, సోషల్ మీడియాలో ఇటువంటి పుకార్లు పుట్టించవద్దని అందరికీ మనవి చేస్తున్నాను. నేను బిఆర్ఎస్ పార్టీలో ఓ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కేసీఆర్ చెప్పిన్నట్లు నడుచుకుంటాను తప్ప నాకు వేరే ఏ ఆలోచనలు లేవు. నేను కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను.
ఇటువంటి రాతలు మానుకోవాలని మీడియా మిత్రులకు, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్నవారికి మనవి చేస్తున్నాను. మీకు వ్యూస్ ఎక్కువ రావాలనో లేదా సంచలనం కోసమో లేదా మీ మీడియా సర్క్యులేషన్ పెరగాలనో నా గురించి ఇటువంటి తప్పుడు వార్తలు రాస్తే ఇకపై సహించే ప్రసక్తే లేదు.
ఇంతకాలం ఇటువంటి రాతలను నేను పట్టించుకోలేదు కానీ నా విశ్వసనీయతని దెబ్బ తీస్తుంటే ఇంకా చూస్తూ ఊరుకోను. నా గురించి తప్పుడు వార్తలు వ్రాసేవారికి లీగల్ నోటీసులు పంపిస్తాను. కనుక,” అంటూ హరీష్ రావు మీడియాకు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.