కేసీఆర్‌ కనబడుటలేదు: గజ్వేల్లో పోస్టర్స్

సిద్ధిపేట జిల్లాలో కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ పట్టణంలో గోడలపై శనివారం ఉదయం కేసీఆర్‌ ఫోటో పోస్టర్స్ ప్రత్యక్షమయ్యాయి.

ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి గజ్వేల్ నియోజకవర్గానికి రాలేదని కనుక ఆయన ఆచూకీ తెలియజేసిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడుతుందని వాటిలో పేర్కొన్నారు. 

కొంతమంది యువకులు బహుశః బీజేపీకి చెందినవారు కేసీఆర్‌ ఫోటోలతో ఫ్లెక్సీ బ్యానర్లు పట్టుకొని కేసీఆర్‌ ఎక్కడ ఉన్నా తక్షణం గజ్వేల్ వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించాల్ని డిమాండ్ చేస్తూ పట్టణంలో ర్యాలీ కూడా నిర్వహించారు. అనంతరం వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసీఆర్‌ని వెతికి పెట్టమని వినతి పత్రం కూడా ఇచ్చారు. 

ఈ సందర్భంగా వారు కేసీఆర్‌ గురించి పోస్టర్లలో వ్యంగ్యంగా... ఆయన తెల్ల చొక్కా, తెల్ల రేషన్ కార్డులు ప్యాంటు ధరించి నెత్తిన టోపీ పెట్టుకొని తిరుగుతుంటారని, ఆయన 80 వేలకు పైగా పుస్తకాలు చదివిన మహా మేధావి అని, ఎకరాకు కోటి రూపాయలు సంపాదించే గొప్ప రైతు అని పేర్కొన్నారు. 

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీరికలేక పోవడం వలన గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించలేకపోయేవారు. కానీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కనుక బాగానే అభివృధ్ది జరిగింది. కానీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి అధికారం కోల్పోయినందున కేసీఆర్‌ కేవలం గజ్వేల్ ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ ఓ ఎమ్మెల్యేగా నియోజకవర్గం ప్రజలను కలుసుకొని తమ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉంటుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు.