భారత్-శ్రీలంకల మద్య బంధం ఈనాటిది కాదు. ఆనాడు త్రేతాయుగంలో రామ రావణ యుద్ధానికి ముందు నుంచే మొదలైంది. అప్పటి నుంచి రెండు దేశాల మద్య సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి.
మద్యలో ఎల్టీటీఈ వేర్పాటువాదం, ఎల్టీటీఈ ఉగ్రవాదుల చేతిలో భారత్ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్య, చైనా నౌకలు, అణ్వాస్త్ర జలాంతర్గాములను నిలుపుకోవడానికి శ్రీలంక భూభాగాన్ని ఇవ్వడం వంటి కొన్ని కారణాల వలన ఇరు దేశాల మద్య సంబంధాలు దెబ్బ తిన్నప్పటికీ, మళ్ళీ పునరుద్దరించుకొని ముందుకే సాగుతున్నాయి.
ఇప్పుడు భారత్- శ్రీలంకలను కలుపుతూ సముద్రంపై 23కిమీ పొడవైన వంతెన నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలపై ఇరుదేశాలు ఓ భారీ ప్రాజెక్టుపై అధ్యయనం చేస్తున్నాయి. దాని ప్రాధమిక దశ అధ్యయనం పూర్తయిందని త్వరలోనే తుది అధ్యయనం కూడా పూర్తి కాబోతోందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే ఆ దేశ మీడియాకు తెలియజేశారు. భారత్-శ్రీలంక మద్య రోడ్డు మార్గం నిర్మించాలనే కల ఈనాటిది కాదని చాలా దశాబ్ధాలుగా ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇప్పటికీ కొలిక్కి వచ్చే అవకాశం ఏర్పడిందని అన్నారు.
శ్రీలంకలో భారత్ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతోంది. వాటిలో మన్నార్లో ఆదానీ గ్రూప్ అధ్వర్యంలో ఓ విండ్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం, ట్రింకోమలిలో ఓ భారీ పారిశ్రామిక పార్కు వంటివి మరికొన్ని ఉన్నాయని తెలిపారు.
భారత్-శ్రీలంక దేశాల మద్య ఓ పవర్ గ్రిడ్ ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే చెప్పారు.
ఈ నెల 20వ తేదీన భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ బృందం శ్రీలంకలో పర్యటించబోతోంది. ఈ పర్యటనలో ఈ ప్రాజెక్టులలో కొన్ని ఖరారు అయ్యే అవకాశం ఉంటుంది.