అక్కడ జగన్‌ పదవి ఊడింది... ఇక్కడ షెడ్లు కూలాయి

ఏపీలో జగన్‌ ఓడిపోయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో ఆ రాష్ట్రంలో సమూలంగా ప్రక్షాళన మొదలైంది. జగన్‌కు వీరవిధేయులుగా మెసులుకుంటూ తమ పరిధి దాటి వ్యవహరించిన ఐఏఎస్, ఐ‌పిఎస్ అధికారులందరినీ చంద్రబాబు తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం మారింది కనుక ఇటువంటి చర్యలు సహజమే. కానీ ఆ ప్రభావం ఇక్కడ హైదరాబాద్‌లో కూడా కనిపించింది. 

ఇంతకాలం ఆయన ఏపీలోనూ, ఇక్కడ కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసం ముందు రోడ్డుపై కొంత స్థలం ఆక్రమించి షెడ్లు నిర్మించుకున్నా అధికారులు మిన్నకుండిపోయారు. కానీ ఇప్పుడు అక్కడా, ఇక్కడా ప్రభుత్వాలు మారడంతో నేడు జీహెచ్‌ఎంసీ అధికారులు జేసీబీని వెంటపెట్టుకొని వెళ్ళి ఆ షెడ్లను కూల్చివేశారు. 

ఆ మార్గం గుండా నిత్యం రాకపోకలు సాగించే ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందున వాటిని తొలగించామని చెప్పారు. అంటే ఇంతకాలంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నా అధికారులు ఏమీ చేయలేకపోయారని స్పష్టం అవుతోంది.