ఛత్తీస్ఘడ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీస్ పంపింది.
ఈరోజు (జూన్ 15)లోగా కమీషన్ ఎదుట స్వయంగా హాజరై ఈ రెండు అంశాలపై సంజాయిషీ ఇవ్వవలసిందిగా ఆదేశించింది. కేసీఆర్ విచారణకు హాజరుకాలేదు కానీ చివరి రోజున ఘాటుగా వ్రాసిన ఓ పెద్ద లేఖ పంపించారు.
తెలంగాణ ఏర్పడే సమయానికి రాష్ట్రంలో విద్యుత్ కొరత, కోతల గురించి వివరించి ఆ పరిస్థితులలో అత్యవసరంగా విద్యుత్ సమస్యలను తీర్చేందుకు తమ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవలసి వచ్చిందని దానిలో పేర్కొన్నారు. ఇవి మీతో సహా అందరికీ తెలిసిన వాస్తవాలే అని, కనుక నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన మీరు మొన్న మీడియాతో మాట్లాడినప్పుడు మమ్మల్ని దోషిగా ముందే తీర్పు చెప్పేసిన్నట్లు మాట్లాడటం సరికాదని కేసీఆర్ తప్పు పట్టారు.
మాపై రాజకీయ కక్ష గట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వ్యతిరేకంగా నివేదిక ఇప్పించడానికే మీ కమీషన్ ఏర్పాటు చేసిన్నట్లు భావిస్తున్నాము. కనుక మీ ఎదుట హాజరయ్యి మేము ఏమి మాట్లాడినా ఉపయోగం ఉండబోదు. మేము ఎటువంటి పరిస్థితులలో ఈ నిర్ణయాలు తీసుకున్నామో మీకు అర్దమైతే తక్షణం కమీషన్ నుంచి మీరు తప్పుకుంటే బాగుంటుంది,” అని కేసీఆర్ ఆ లేఖలో వ్రాశారు.