కేసీఆర్‌కు ఈడీ నోటీస్ ఇవ్వలేదు గానీ...

కేసీఆర్‌ హయాంలో గొల్ల కురుమలకు స్వయం ఉపాధి కోసం గొర్రెల పంపిణీ పధకం ప్రారంభించింది. దాని గురించి కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్ నేతలు చాలా గొప్పగా గొప్పలు చెప్పుకున్నారు.

నిజానికి అది చాలా మంచి పధకమే. కానీ బిఆర్ఎస్ పార్టీలో కొందరు నేతలు, అధికారులతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటితో పాటు ఈ పధకంపై కూడా విచారణ జరిపించగా సుమారు రూ.700 కోట్ల గోల్ మాల్‌ జరిగిన్నట్లు అంచనా వేసింది.

ఈ వార్తలు మీడియా, సోషల్ మీడియాలో రావడంతో ఈడీ దృష్టి పడింది. దీంతో హైదరాబాద్‌లోని ఈడీ అధికారులు జూన్ 12వ తేదీన తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్‌ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీకి ఓ లేఖ వ్రాశారు.

ఈ పధకంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగిన్నట్లు వార్తలు వస్తున్నందున తాము దీనిపై లోతుగా విచారణ జరపాలని అనుకుంటున్నామని. కనుక ఈ పధకానికి సంబందించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.

ఈ పధకానికి సంబందించి మార్గదర్శకాలు, అర్హుల ఎంపిక, లబ్ధిదారులు, గొర్రెల కొనుగోలుకి చెల్లించిన సొమ్ము వివరాలు, గొర్రెల పంపిణీ చేసిన వారి వివరాలు తమకు వీలైనంత త్వరగా సమర్పించాలని ఆ లేఖలో ఈడీ కోరింది. 

ఈ లేఖ సోషల్ మీడియాలో లీక్ అవడంతో బీజేపీ నేత రఘునందన్ రావు తదితరులు కేసీఆర్‌కు ఈడీ నోటీస్ ఇచ్చిందంటూ చెప్పడంతో రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. కానీ ఈడీ చేతికి ఈ పధకానికి సంబందించిన వివరాలు కూడా అందలేదని లేఖ, తేదీని బట్టి అర్దమవుతోంది.

కానీ ఈ వ్యవహారంపై ఈడీ విచారణ చేపట్టబోతోందని కూడా స్పష్టమవుతోంది. కనుక ఒకవేళ ఈ పధకంలో రూ.700 కోట్లు అవినీతి జరిగి ఉంటే ఏదో రోజు అది కూడా కేసీఆర్‌, మాజీ మంత్రి తలసాని యాదవ్‌ మెడకు చుట్టుకోక మానదు.