ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కళ్యాణ్‌?

ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో టిడిపి, జనసేన, బీజేపీ కూటమి ఘనవిజయం సాధించి అధికారంలోకి రాబోతోంది.

ఈరోజు విజయవాడలో జరిగిన మూడు పార్టీల ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు నాయుడుని తమ శాసనసభా పక్ష నాయకుడుగా ఎన్నుకోగా, అంతకు ముందు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ కళ్యాణ్‌ని తమ శాసనసభా పక్ష నాయకుడుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.

అనంతరం మూడు పార్టీల ప్రతినిధులు ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తమ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించవలసిందిగా కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. 

 బుధవారం ఉదయం 11.27 గంటలకు గన్నవరం వద్ద కేసరపల్లి ఐ‌టి పార్కులో  చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కనుక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవిని ఏపీ ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. చిరంజీవి, రామ్ చరణ్‌, మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ సకుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్రమంత్రులు, తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.