ఆదివారం సాయంత్రం మోడీ ప్రమాణ స్వీకారం

ఈరోజు ఢిల్లీలో ఎన్డీయే భాగస్వాముల సమావేశంలో అన్ని పార్టీలు నరేంద్రమోడీని తమ నాయకుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. కనుక ఆదివారం సాయంత్రం 6 గంటలకు నరేంద్ర మోడీ ముచ్చటగా మూడో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

బీజేపీ సీనియర్ నేత ప్రహ్లాద్ జోషీ ఈ విషయం ప్రకటించారు. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ నేతలు, కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎన్డీయే భాగస్వాములు, ప్రతిపక్ష నేతలు, ఎంపీలు, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు దేశాధినేతలు కూడా హాజరుకానున్నారు.

ఆ తర్వాత జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్రమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, బీజేపీ నేతలు, ఎంపీలు హాజరుకానున్నారు. 

గత ఏడాది జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మోడీ, అమిత్ షాలు స్పందించకుండా మౌనంగా ఉండిపోయి, పరోక్షంగా ఆయన అరెస్టుకి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత టిడిపితో పొత్తు ఇష్టమే లేదన్నట్లు ప్రవర్తించారు.

కానీ ఇప్పుడు మోడీ ప్రధాని పదవి చేపట్టడానికి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు (టిడిపి ఎంపీ)ల మద్దతు అత్యవసరమైంది. అయితే ఏపీలో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్‌ ద్వారా కట్టడి చేయిస్తూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేందుకు మూడీ కూడా తోడ్పడ్డారు. కనుక ఇద్దరూ తమ చేదు జ్ఞాపకాలను పక్కన పెట్టేసి ఒకరికొకరు సహకరించుకుంటున్నారు.