ఈసారి సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమి 370-400 సీట్లు గెలుచుకుంటుందని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ కేవలం 292కి పరిమితం అయ్యింది. ఇదివరకు వద్దనుకున్న చంద్రబాబు నాయుడే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారు.
అలాగే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మద్దతు కూడా చాలా కీలకంగా మారింది. కనుక ఈరోజు పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే భాగస్వాములతో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ స్వరం కాస్త మెత్తబడింది.
వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దక్షిణాదిలో ప్రజలు ఎన్డీయేని చాలా ఆదరించారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మన బలం పెరిగింది. కేరళ నుంచి తొలిసారిగా బీజేపీ ఎంపీ లోక్‌సభలో అడుగుపెడుతున్నారు.
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. కానీ అప్పుడే ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత మొదలైంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించింది.
మన కూటమి విజయం సాధించినా కొందరు (కాంగ్రెస్ మిత్ర పక్షాలు) అంగీకరించడం లేదు. మనం ఎన్నికలలో ఓడిపోయామనే వాదిస్తూ ప్రజలను మభయ్పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ మనమే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము. కనుక వారి అనుమానాలు నివృత్తి అయ్యే ఉంటాయి.
కూటమిలో పరస్పర విశ్వాసం చాలా ముఖ్యం. ఇకపై అందరం కలిసి కూర్చొని సమిష్టి నిర్ణయాలు తీసుకుందాము. అందరం కలిసి భారత్‌ని అభివృద్ధి పదంలో నడిపిద్దాము,” అని అన్నారు.