పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో రాజకీయాలలోకి ప్రవేశించి గత పదేళ్ళలో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. ఎన్నో అవమానాలు భరించారు. పదేళ్ళపాటు అన్నీ తట్టుకొని నిబ్బరంగా నిలబడి పోరాడినందుకు చివరికి విజయం సాధించారు.
ఇటీవల జరిగిన ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఆయన పిఠాపురం నుంచి 70 వేలకుపైగా భారీ మెజార్టీతో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జనసేన పోటీ చేసిన 22 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లను గెలుచుకుని వైసీపి (11/2) కంటే మెరుగైన ఫలితాలను సాధించింది.
ఇక టిడిపి, జనసేనలు ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నందున ఈరోజు ఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వాముల సమావేశానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ తనతో పాటు తన భార్య అన్న లేజ్నెవా, కుమారుడు అఖీరా నందన్‌ని వెంటపెట్టుకొని వెళ్ళి వారిని ప్రధాని నరేంద్రమోడీకి పరిచయం చేశారు.
ప్రధాని నరేంద్రమోడీ వారిని ఆప్యాయంగా పలకరించి అఖిరానందన్ భుజం మీద చేయి వేసి మాట్లాడారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమ కొడుకు అఖిరాని ప్రధాని నరేంద్రమోడీ పక్కన చూసి తాను ఆనందంతో పొంగిపోయానని పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోషం వ్యక్తం చేశారు.