తెలంగాణ రాజముద్ర విషయంలో విమర్శలు ఎదుర్కొన్న సిఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో వివాదానికి బీజం వేశారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, “ఇకపై ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాము.
ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో అలనాటి తెలంగాణ మహిళా ఉద్యమకారుల రూపాలు ప్రతిభించే విదంగా విగ్రహం రూపొందింపజేస్తున్నాము. దానిని ఈ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలలో సోనియా గాంధీ చేత ఆవిష్కరింపజేస్తాము.
తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రం కలని సాకారం చేసిన సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా ఆహ్వానించాము. కానీ ఆరోగ్యకారణాల వలన రాలేకపోయారు. కనుక ఆమె చేత డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరింపజేసి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తాము. ఆ తర్వాత సచివాలయంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాము,” అని చెప్పారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం మార్చాలనే ఆలోచన, డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరపాలనే ఆలోచన రెండూ మళ్ళీ వివాదం రాజేసేవే.
గత పదేళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ప్రజలు తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏటా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలనాడు, బతుకమ్మ వంటి పండుగల సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవం చాటుకుంటారు. కనుక తెలంగాణ ప్రజల దృష్టిలో ఆ రూపమే ఉంది.
కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు అది మన తల్లిబొమ్మ కాదు వేరే ఏర్పాటు చేస్తానని చెపుతున్నారు. కనుక ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహాలకు ఎటువంటి విలువలేదని చెపుతున్నట్లే ఉంది. కనుక వాటన్నిటినీ తొలగించి మళ్ళీ కొత్త తెలంగాణ తెలంగాణ తల్లి బొమ్మలను ప్రతిష్టించుకోవలసి ఉంటుంది. కనుక ఈ ప్రతిపాదనకు ప్రజలు, ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడం ఖాయమే.
రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ఉత్సవాలకు డిసెంబర్ 9వ తేదీని ఎంచుకోవడం దేనికో అందరికీ తెలుసు. ఆ రోజు సోనియా గాంధీ పుట్టిన రోజు. అంటే తెలంగాణ తల్లి ఉత్సవాల పేరుతో తెలంగాణలో సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు జరిపించాలని యోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కనుక ఈ ప్రతిపాదనను ప్రజలు, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడం ఖాయమే అని భావించవచ్చు.
సిఎం రేవంత్ రెడ్డి పాలన, రాష్ట్రాభివృద్ధి, ఎన్నికల హామీల అమలు, పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించి ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పెంచడం వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. కానీ ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలతో కాలక్షేపం చేస్తే ఏపీ ఎన్నికలలో వైసీపి తుడిచిపెట్టుకుపోయిన్నట్లు తెలంగాణలో కాంగ్రెస్ కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుందని గ్రహిస్తే మంచిది.