ఏపీలో ఈ 5 ఏళ్ళలో జరిగిన రాజకీయాలన్నీ ఓ ఎత్తు అయితే, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో జరిగిన రాజకీయాలు ఒక్కటీ మరో ఎత్తు అన్నట్లు సాగాయి. ఈసారి ఎన్నికలలో గెలవడం అధికార వైసీపికి, ఇటు ప్రతిపక్ష టిడిపి, జనసేనలకు చాలా ముఖ్యం అవడంతో ఇరువర్గాలు సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి.
ఈ ప్రయత్నంలో భాగంగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలని జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. కనుక ఆ వర్గం ప్రజలు ఎక్కువగా ఉన్న పిఠాపురం నుంచి పోటీ చేశారు.
కనుక ఆయనను ఓడించేందుకు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని వైసీపిలోకి తీసుకొని ఆయన చేత పవన్ కళ్యాణ్‌ని తిట్టించారు.
అంత పెద్దాయన తన వయసు, అనుభవం, హుందాతనం అన్నీ పక్కన పెట్టి ప్రతీరోజూ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుండేవారు. ఆ ఆవేశంలో ఈసారి ఎన్నికలలో పవన్ కళ్యాణ్‌ని ఓడించలేకపోతే నాపేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని శపధం చేశారు. తాను పిఠాపురంలో కాలుపెట్టకుండానే పవన్ కళ్యాణ్ ఓడించగలనని అంత నమ్మకం ఆయనకు.
కానీ పవన్ కళ్యాణ్ సుమారు 70,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ముద్రగడ పద్మనాభ రెడ్డిగారు అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ట్రోలింగ్ చేయసాగారు. అత్యుత్సాహంతో శపధం చేసినప్పటికీ ఇప్పటికైనా ఆయన నా మాటలను వెనక్కు తీసుకుంటున్నానంటూ పవన్ కళ్యాణ్‌కి అభినందనలు తెలియజేసి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
కానీ ఈ వయసులో పంతానికి పోయి, తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే విషయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడంతో ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.