ఈ నెల 9న జరుగవలసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ జరుగనున్నాయి. టీజీపీఎస్ఎస్సీ ఇప్పటికే ప్రిలిమ్స్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి హాల్ టికెట్స్ కూడా జారీ చేస్తోంది.
కానీ అదే రోజున ఇంటలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ ఆఫీసర్ గ్రేడ్-1 ఉద్యోగాలకు, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్ జరుగబోతోంది. కనుక గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.
వాటిపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపినప్పుడు, టీజీపీఎస్ఎస్సీ తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, ఇంటలిజన్స్ బ్యూరోలో రెండు పోస్టులకు కేవలం 700 మంది అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, కానీ గ్రూప్-1 పోస్టుల కోసం 4 లక్షల మంది ఈ ప్రిలిమ్స్ వ్రాయబోతున్నారని చెప్పారు. కనుక రెండు ఉద్యోగాల కోసం 4 లక్షల మంది అభ్యర్ధులను ఇబ్బంది పెట్టడం సరికాదని వాదించారు.
ఆయన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, ఈ దశలో గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పేసింది. అయితే ఈ పిటిషన్లపై టీజీపీఎస్ఎస్సీ మరోసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకొదలిస్తే తమకు అభ్యంతరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈనెల 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ జరుగబోతోంది.