తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుని హైకోర్టు సుమోటోగా స్వీకరించి నిన్న విచారణ జరిపింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈకేసుపై విచారణ జరిపినప్పుడు న్యాయమూర్తులతో సహా ఏ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసినా అది వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించిన్నట్లే అవుతుందని, దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
కనుక ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, నిఘా విభాగం అదనపు డీజీపీకి నోటీసులు పంపించింది. నాలుగు వారాలలోగా అందరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను జూలై 3కి వాయిదా వేసింది.
ఈ కేసీఆర్ టెలిగ్రాఫ్ చట్టం పరిధిలోకి వస్తుందని మాజీ అడ్వకేట్ జనరల్ కే.రామకృష్ణా రెడ్డి వాదనలపై న్యాయమూర్తులు స్పందిస్తూ, కేసు విచారణ మొదలు పెట్టిన రోజే ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేమని, ఈ కేసులో అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఈ కేసుపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపిస్తున్నప్పటికీ, రాజకీయ కారణాల వలన అది ఇప్పట్లో ముగిసేలా లేదు. కనుక తదుపరి విచారణలో వాదనలు పూర్తయితే ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశిస్తే తెలంగాణ ప్రభుత్వం కాదనలేకపోవచ్చు. సీబీఐ చేతికి ఈ కేసు వెళ్ళిందంటే, కేసీఆర్‌కు కొత్త కష్టాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.