ఆదివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌ను బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చెత్తబుట్టలో పడేయాలని అన్నారు. నేడు తెలంగాణ భవన్లో పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “శాసనసభ ఎన్నికలలో ఓటమితో పార్టీలో అందరూ చాలా ఢీలాపడ్డారు. కానీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం నేను చేపట్టిన బస్సుయాత్రతో అటు ప్రజలలో, ఇటు పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహం పొంగిపొర్లుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఎందుకు పనికి రావు. వాటిని చెత్తబుట్టలో పడేయాల్సిందే.
కొన్ని బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదంటాయి. మరొకటి బిఆర్ఎస్ పార్టీ 11 సీట్లు వస్తాయని చెపుతుంది. రెంటిలో దేనిని నమ్మాలి? ఈ ఎగ్జిట్ పోల్స్ ఏమైనా ప్రామాణికత ఉందా? అని అనుమానం కలుగుతుంది. ఈ గెలుపోటములతో సంబంధం లేకుండా పనిచేసుకుపోవడమే మన పని. మనకి మూడు సీట్లు మాత్రమే వచ్చినా క్రుంగిపోయే ప్రసక్తే లేదు. రాజకీయ పార్టీలకు జయాపజయాలు సహజం. వాటికి ఎవరూ అతీతులు కారు,” అని కేసీఆర్ అన్నారు.
తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లలో కనీసం 10-12 బిఆర్ఎస్ పార్టీకి వస్తాయని తన సర్వేలలో తేలిందని కేసీఆర్ ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ ఎగ్జిట్ పోల్స్ బిఆర్ఎస్ పార్టీకి 2-3 సీట్లు కంటే ఎక్కువ రావని సూచిస్తున్నాయి.
కాంగ్రెస్, బీజేపీలకు చెరో 7-9 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పడంతో, కేసీఆర్ ఆ ఎగ్జిట్ పోల్స్ చెత్త అని తీసి పడేసిన్నట్లు అర్దమవుతూనే ఉంది.
అయితే మూడు సీట్లు వచ్చినా క్రుంగిపోము, జయాపజయాలు సహజం అనే ఆయన మాటలు ఎగ్జిట్ పోల్స్‌ని అంగీకరిస్తున్నట్లే ఉన్నాయి కదా?