పదేళ్ళ తర్వాత తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు పూర్తయింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పదేళ్ళ తర్వాత తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అని ప్రశ్నించుకుంటే సంతృప్తికరంగానే ఉందనిపిస్తుంది. 

పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌ రాజకీయాలను, అవినీతిని, నిరంకుశ్వత్వాన్ని పక్కనపెట్టి చూస్తే, ఈ పదేళ్ళలో రాష్ట్రాన్ని ఆయన ఎంతగానో అభివృద్ధి చేసి చూపారు. ఆ అభివృద్ధి కళ్ళకు కనిపిస్తోంది కూడా. కేసీఆర్‌ కూడా గత పాలకుల మాదిరిగానే అభివృద్ధిని హైదరాబాద్‌కి మాత్రమే పరిమితం చేయకుండా అన్ని జిల్లాలను సమాంతరంగా అభివృద్ధి చేశారు. 

ఎక్కడికక్కడ సమీకృత కలెక్టర్‌ కార్యాలయాలు, వైద్య, నర్సింగ్ కళాశాలలు, విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, టాంక్ బండ్‌లు వగైరా నిర్మింపజేశారు. ఐ‌టి కంపెనీలను జిల్లాలకు కూడా వ్యాపింపజేశారు. 

కేసీఆర్‌ పదేళ్ళ పాలనలో హైదరాబాద్‌ నగరానికి లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు రప్పించి లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. వీటితో హైదరాబాద్‌తో సహా చుట్టుపక్కల జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది. భూముల ధరలు విపరీతంగా పెరగడంతో రైతులు ధనవంతులయ్యారు. 

హైదరాబాద్‌తో రాష్ట్రమంతా పచ్చదనం పెంచారు. దశాబ్ధాలుగా ఎవరూ పట్టించుకొని పర్యాటక రంగానికి కేసీఆర్‌ ప్రాధాన్యత ఇవ్వడంతో రాష్ట్రంలో గుర్తింపుకి నోచుకోని అనేక ప్రసిద్ద పర్యాటక ప్రాంతాలు అందుబాటులోకి వచ్చాయి. 

టెక్స్ టైల్ పార్కులు, ఐ‌టి హబ్‌లు, ఫార్మా, మెడికల్ పార్కులు, చిన్న మద్య తరహా పరిశ్రమలకు వేరేగా పార్కులు, డ్రైపోర్టులు ఇలా అవకాశం ఉన్న ప్రతీ రంగాన్ని కేసీఆర్‌ అభివృద్ధి చేశారు.       

వీటన్నిటితో రాష్ట్ర ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. కనుక కేసీఆర్‌ దూరదృష్టితో చేసిన ఈ అభివృద్ధి పనుల వలన పదేళ్ళ తర్వాత నేడు తెలంగాణ ఆర్ధికంగా చాలా బలంగా నిలిచింది. దేశంలో ప్రధాన మెట్రో నగరాలలో హైదరాబాద్‌ కూడా ఒకటిగా నిలుస్తోంది.