తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నేటికీ పదేళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఉదయం 9.30 గంటలకు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు ఆర్పిస్తారు.
ఆ తర్వాత అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ చేరుకొని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో పాల్గొంటారు. అదే వేదికపై నుంచి జయ జయ హే... గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా ప్రకటించి జాతికి అంకితం చేస్తారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు సాయంత్రం టాంక్ బండ్‌పై సుమారు గంటన్నర పాటు కళారూపాల ప్రదర్శన, సాంస్కృతిక, బాణాసంచా కాల్చే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వేడుకలలో 13 నిమిషాల నిడివిగల జయ జయ హే... పూర్తి గీతాన్ని విడుదల చేస్తారు. ఈ గీత రచయిత కవి అందెశ్రీని, దీనిని స్వరపరిచిన సంగీత దర్శకుడు కీరవాణిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానిస్తారు.
వాటిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రతిపక్షనేతలు, ప్రముఖులు, అధికారులు పాల్గొంటారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సచివాలయం, టాంక్ బండ్, అంబేడ్కర్ విగ్రహం, ఛార్మినార్, గోల్కొండ, అమరవీరుల స్తూపం తదితర ప్రాంతాలను రంగురంగుల విద్యుదీపాలతో అందంగా అలంకరించారు.
ఈరోజు సాయంత్రం టాంక్ బండ్‌పై జరిగే వేడుకలకు పెద్ద ఎత్తున నగర ప్రజలు వస్తారు కనుక అందుకు తగ్గట్లుగా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, వైద్య , విద్యుత్ తదితర శాఖలు అవసరమైన ఏర్పాట్లు చేశాయి.