దశాబ్ధి ఉత్సవాలలో ఈ మూర్ఖపు నిర్ణయాలు దేనికి?

బిఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేడు పార్టీ ముఖ్య నేతలతో కలిసి పాతబస్తీలో ఛార్మినార్ వద్దకు చేరుకుని, రాష్ట్ర ప్రభుత్వపు తాజా నిర్ణయాని నిరసిస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “గత పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతగానో అభివృద్ధి చెందింది. కనుక దశాబ్ధి ఉత్సవాలలో రాష్ట్రాభివృద్ధి గురించి చెప్పుకోకుండా రాష్ట్ర రాజముద్రలో ఈ మార్పులు చేర్పులు దేనికి? ఇప్పుడు అంత అవసరం ఏమోచ్చింది?

 తెలంగాణను సాధించి అభివృద్ధి చేసిన కేసీఆర్‌ పేరుని కనబడకుండా చేయాలనే తాపత్రయం దేనికి? పాలన, అభివృద్ధి, హామీల అమలు గురించి ఆలోచించకుండా ఈ మూర్ఖపు ఆలోచనలు దేనికి?

అనేక దశాబ్ధాలుగా ఛార్మినార్ హైదరాబాద్‌ నగరానికి ప్రతీకగా నిలుస్తోంది. కాకతీయ తోరణం తెలంగాణ చారిత్రిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. అటువంటి వాటిని అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఏమిటి? ప్రభుత్వ నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనని విరమించుకొని పాలనపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము,” అని కేటీఆర్‌ అన్నారు.