అందుకే వారికి సిఎం రేవంత్‌ నంబర్ ఇచ్చా: రాజాసింగ్

బీజేపీ ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు రెండు మూడు రోజులుగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. బుధవారం ఉదయం 9.19 గంటలకు మళ్ళీ మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజా సింగ్‌ చెప్పారు.

వారి మాటలను బట్టి వారు ఉగ్రవాదులు అయ్యి ఉండవచ్చని రాజా సింగ్‌ అనుమానం వ్యక్తం చేశారు. మతం మారకపోతే తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని వారు బెదిరిస్తున్నట్లు రాజా సింగ్‌ తెలిపారు. ఈ బెదిరింపు కాల్స్ గురించి డిజిపికి లేఖ వ్రాసి ఫిర్యాదు చేశారు. 

గతంలో కూడా తనకు ఇలాగే బెదిరింపు కాల్స్ వచ్చాయని అప్పుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదని రాజా సింగ్‌ లేఖలో పేర్కొన్నారు. ఓ ప్రజా ప్రతినిధినైన తనను చంపేస్తామని ఎవరో బెదిరిస్తూ కాల్స్ చేస్తుంటే పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండటం తగదన్నారు. కనుక తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని, తనకు ఈ బెదిరింపు కాల్స్ చేస్తున్నవారిని కనిపెట్టి అరెస్ట్ చేయాలని రాజా సింగ్‌ ఆ లేఖలో కోరారు. ఆ లేఖ కాపీని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పంపారు. 

అనంతరం రాజా సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ, “ఉగ్రవాదులు నన్ను, నా కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరిస్తున్నప్పటికీ ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవడం లేదు. అందుకే ఉగ్రవాదులకు సిఎం రేవంత్‌ రెడ్డి ఫోన్ నంబర్ ఇచ్చాను. ఈసారి ఉగ్రవాదులు సిఎం రేవంత్‌ రెడ్డికి ఫోన్ చేస్తే అప్పుడైనా పోలీసులు స్పందిస్తారో లేదో చూద్దాం,” అని అన్నారు.