అర్వింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షాక్

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఈరోజు షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్ట్ అయిన అర్వింద్ కేజ్రీవాల్‌కు జూన్ 1వరకు మద్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

ఆ గడువు ముగుస్తుండటంతో మరో వారం రోజులు బెయిల్‌ పొడిగించాలని కోరుతూ అర్వింద్ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్‌లో పిటిషన్‌ వేయగా, దానిని స్వీకరించడానికి నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు బెంచ్ విచారణ జరుపుతున్నప్పుడు మళ్ళీ తమ వద్ద బెయిల్‌ పిటిషన్‌ వేస్తే అంగీకరించలేమని స్పష్టం చేసింది. 

జూన్ 4వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు ఆమాద్మీ పార్టీ అధినేతగా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరిస్తున్న అర్వింద్ కేజ్రీవాల్‌కు బెయిల్‌ పొడిగించకుండా జైలులో నిర్బందించి ఉంచడం ఆయన రాజకీయ హక్కుకు భంగం కలిగిస్తోందని ఆయన తరపు న్యాయవాది వాదిస్తున్నారు. 

దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ మాత్రమే నిర్ణయం తీసుకోగలరని వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి తేల్చి చెప్పేశారు.  దీంతో జూన్ 2వ తేదీన ఆయన మళ్ళీ పోలీసులకు లొంగిపోయి జైలుకి వెళ్ళక తప్పదు.