తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరికాన్ని సూచించే ఛార్మినార్, కాకతీయ తోరణాలను తొలగించి ఉద్యమస్ఫూర్తిని, అమరవీరుల త్యాగాలను, ప్రజాస్వామ్యాన్ని సూచించే విదంగా చిహ్నం రూపొందించేందుకు జరిపిన కసరత్తు దాదాపు పూర్తి అయిన్నట్లు తెలుస్తోంది.
నేడు సిఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రొఫెసర్ కోదండరామ్, వామపక్ష నేతలు, జెఏసీ నేత రఘు, మంత్రి జూపల్లి కృష్ణారావు, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అధికారులతో సమావేశమయ్యి ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం సమర్పించిన తుది నమూనాపై చర్చించారు. దీని కోసం మొదట 12 నమూనాలు రూపొందించగా వాటిలో ఒకటి ఫైనల్ చేసి కొన్ని మార్పులు చేర్పులు సూచించిన్నట్లు తెలుస్తోంది.
మొదట ఛార్మినార్ బొమ్మని తొలగించాలని అనుకున్నప్పటికీ దానిని అలాగే ఉంచి కాకతీయ తోరణాన్ని మాత్రమే తొలగించి దాని స్థానంలో కొన్ని మార్పులను చేయాలని వారు సూచించిన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరానికి మాత్రమే కాక యావత్ తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో ఛార్మినార్ ప్రత్యేక గుర్తింపు కల్పించింది కనుక దానిని అలాగే ఉంచాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.
వారి సలహాలు, సూచనల మేరకు రుద్ర రాజేశం తుది నమూనాని సిద్దం చేసి ఒకటి రెండు రోజులలో సిఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు. మళ్ళీ అందరూ మరోసారి దానిని పరిశీలించిన తర్వాత అందరి ఆమోదంతో దానిని జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో విడుదల చేస్తారు.