ఈడీ రిపోర్టులో కేసీఆర్‌ పేరు లేదు: మోహిత్ రావు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో మంగళవారం ఢిల్లీ హైకోర్టులో ఈడీ, సీబీఐ తమ వాదనలు వినిపించాయి. వాటిలో ఈ లిక్కర్ స్కామ్‌ గురించి కేసీఆర్‌కు ముందే తెలుసని, కల్వకుంట్ల కవిత స్వయంగా ఈ కుంభకోణంలో సూత్రదారులను తన తండ్రి కేసీఆర్ ఢిల్లీ వచ్చినప్పుడు పరిచయం చేశారని, వారి ద్వారా ఆయన ఈ వ్యవహారం ఏవిదంగా సాగబోతోందో తెలుసుకున్నారని ఈడీ నివేదికలో పేర్కొన్నట్లు నిన్న మీడియాలో వార్తలు వచ్చాయి. 

అయితే ఈడీ రిపోర్టులో ఎక్కడా కేసీఆర్‌ పేరు లేదని, ఈ కేసులో నిందితుడుగా ఉన్న ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ్‌కు మిగిలిన వారిని పరిచయం చేశారని మాత్రమే ఈడీ రిపోర్టులో పేర్కొందని, కానీ దానిని మీడియా వక్రీకరించి కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్‌కు ఈ కుంభకోణంలో సూత్రధారులను పరిచయం చేశారని ఈడీ రిపోర్టులో పేర్కొన్నట్లు ప్రచురించాయని లాయర్ మోహిత్ రావు అన్నారు. వాటిని ఆయన ఖండించారు. 

ఢిల్లీ హైకోర్టులో కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారంతో ఇరు పక్షాల వాదనలు పూర్తయ్యాయి. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తీర్పుని రిజర్వ్ చేశారు.