ప్రజాభవన్‌లో బాంబు... ఉత్తిదే

మంగళవారం మధ్యాహ్నం 12.06 గంటలకు ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 100కు ఫోన్ చేసి  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉంటున్న అధికార నివాసం ప్రజాభవన్‌లో బాంబు పెట్టామని ఫోన్ చేశాడు. వెంటనే పంజగుట్ట పోలీసులకు సమాచారం అందించగా వారు బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్స్ వెంటబెట్టుకొని అక్కడకు చేరుకొని ప్రజాభవన్‌ లోపల, బయట, పరిసర ప్రాంతాలలో సమీపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో అణువణువు తనికీ చేశారు. 

ప్రజాభవన్ పక్కనే ఉన్న మరో భవనంతో పాటు సమీపంలోనే గల మంత్రి సీతక్క ఇంట్లో కూడా తనికీలు చేశారు. సుమారు 4 గంటల సేపు తనికీలు చేసిన తర్వాత ఎక్కడా బాంబులేదని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

ఇది ఎవరో ఆకతాయి పని అయ్యుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతని ఆచూకీ కనిపెట్టేందుకు గాలింపు మొదలుపెట్టారు. ఈ బాంబు బెదిరింపును దృష్టిలో ఉంచుకొని ఇకపై ప్రజాభవన్‌లోకి వచ్చే సందర్శకులలందరినీ క్షుణ్ణంగా తనికీలు చేయాలని భద్రతా అధికారులు నిర్ణయించారు.