తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో ఛార్మినార్, కాకతీయ తోరణాలు రాజరిక పోకడలకు చాటుతున్నాయే తప్ప తెలంగాణ చరిత్రని, ఉద్యమ చరిత్రని, సంస్కృతిని చాటడం లేదని సిఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు.
కనుక రాజముద్రలో ఆ రెంటినీ తొలగించి కొత్త రాజముద్రని రూపొందింపజేస్తున్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త రాజముద్రని విడుదల చేయనున్నారు. దీనిపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
అసలు ఆ రాజముద్రలోని భావాన్ని అర్దం చేసుకోలేకనే రేవంత్ రెడ్డి ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు, రాజముద్రలో ఛార్మినార్, కాకతీయ తోరణం రాజరిక పోకడలని వాదిస్తున్న రేవంత్ రెడ్డికి అందెశ్రీ వ్రాసిన జయజయహే గీతంలో అదే ఛార్మినార్, అదే కాకతీయ రాజులని కీర్తిస్తూ వ్రాసిన చరణాలు ఉన్నాయని తెలియదా?అని ప్రశ్నించారు. అసలు రేవంత్ రెడ్డికి, మంత్రులకి ఎవరికైనా జయజహే గీతంలో ఏముందో తెలుసా? అని ప్రశ్నించారు.
ఈ గీతాన్ని స్వరపరిచేందుకు తెలంగాణలో సంగీత దర్శకులు ఎవరూ లేన్నట్లు ఆంధ్రాకు చెందిన కీరవాణి చేత స్వరపరిపించడంపై కూడా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ‘టిఎస్’ ను ‘టిజి’గా మార్చడం, రాజముద్రలో మార్పులు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం కొరకు వందల కోట్లు ఖర్చు చేయడం అవసరమా? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.