ఎన్టీఆర్‌కు భారత్‌ రత్న అవార్డు ఇవ్వాలి: చిరంజీవి

ప్రముఖ నటుడు, సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా నేడు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. 

“కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను,” అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో కలిసి తీసుకున్న ఓ ఫోటోని తన అభిమానులతో పంచుకున్నారు. 

ఎన్టీఆర్‌ని ఓ సినీ నటుడు, దర్శకుడిగా చూసేవారు మరో ఆలోచన లేకుండా అభిమానిస్తారు. కానీ ఓ రాజకీయ నాయకుడుగా చూసేవారు కూడా ఆయనను అభిమానించేవారు కోకొల్లలున్నారు. ఇటు సినిమాలలో అటు రాజకీయాలలో కూడా ఇన్ని కోట్ల మందిని మెప్పించడం, చనిపోయిన తర్వాత కూడా ఇంతగా ఆదరణ పొందుతుండటం సాధారణమైన విషయం కానే కాదు. కనుక ఇప్పటికైనా ఆయనకు భారత్‌ రత్న అవార్డు ఇవ్వాలని పలువురు కోరుతున్నారనుకోవచ్చు.