కరీంనగర్లో శనివారం హనుమాన్ దీక్షలో ఉన్న భక్తులపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. వారు స్థానిక హనుమాన్ మందిరంలో పూజలు చేసేందుకు వెళుతుండగా, మరో వర్గానికి చెందిన ఓ వ్యక్తి వారికి ఎదురుగా వచ్చి తల్వార్ తిప్పుతూ రెచ్చగొడుతూ మాట్లాడటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది.
హనుమాన్ భక్తులు ఆ వ్యక్తితో వాగ్వాదం చేస్తుండగా, అక్కడే ఉన్న పోలీసులు హనుమాన్ దీక్షలో ఉన్న భక్తులపై లాఠీ ఛార్జ్-షీట్ చేసి చెదరగొట్టారు. వారిలో కొందరిని అరెస్ట్ చేశారు. వారిలో ఒక భక్తుడిని తమ వాహనం వెనుక పరిగెత్తించారు.
హనుమాన్ భక్తులు పోలీసుల తీరుని నిరసిస్తూ రోడ్డుపై ఆందోళన చేస్తుండగా స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకొని వారికి మద్దతుగా ‘జైశ్రీరామ్’ అంటూ పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
హనుమాన్ దీక్షలో ఉన్న భక్తులపై పోలీసులు లాఠీ ఛార్జి చేయడాన్ని, వాహనం వెనుక పరిగెట్టించడాన్ని బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే సమస్య సృస్టించడం సరికాదని బండి సంజయ్, హనుమాన్ భక్తులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై చర్య తీసుకోవలసిందిగా డిజిపి రవి గుప్తాకి ట్విట్టర్ ద్వారా బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. అరెస్ట్ చేసిన భక్తులను తక్షణం బేషరతుగా విడుదల చేయాలని కోరారు.