తెలంగాణలో వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ తదితర జిల్లాలలో, ప్రధానంగా హైదరాబాద్లో స్థిరపడిన లక్షలాది ఆంధ్రా ప్రజలు ఈసారి తమ ఓటు హక్కుని ఆంద్రాలో ఉపయోగించుకునేందుకు ఏపీ బాట పట్టారు.
ఈసారి ఎన్నికలు చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్ రెడ్డికి మద్య ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నట్లే అందరూ భావిస్తున్నారు. గత 5ఏళ్ళుగా జగన్ ప్రభుత్వం సంక్షేమ పధకాలకే ప్రాధాన్యం ఇస్తూ ఎడాపెడా అందినకాడికి అప్పులు చేస్తుండటం వలన ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది.
అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం వలన యువతకు, కార్మికులకు, ఉద్యోగాలు లేక రైతులకు ఉపాధి లేక తెలంగాణ, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. కనుక బహుశః ఈసారి ప్రభుత్వం మార్చే ఉద్దేశ్యంతోనే సెటిలర్స్ ఆంధ్రాలో తమ సొంత ఊర్లకు బయలుదేరిన్నట్లున్నారు.
ఈసారి పోలింగ్ సోమవారం జరుగుతుండటంతో శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్ ఐటి ఉద్యోగులు సకుటుంబ సమేతంగా కార్లు, బస్సులు, రైళ్ళలో ఆంధ్రాకు బయలుదేరారు. ఏపీ, తెలంగాణ ఆర్టీసీ సంస్థలు చెరో 500 ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయంటే ఎంత రద్దీ ఉందో అర్దం చేసుకోవచ్చు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఆంధ్రాకు తరలివేలుతున్న కార్లు, బస్సులతో నిండిపోయింది. టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి.
హైదరాబాద్ నుంచి ఒకేసారి లక్షల మంది ఆంధ్రాకు బయలుదేరుతుండగా, తెలంగాణలో వివిద జిల్లాల నుంచి చదువులు, కోచింగ్, ఉద్యోగాలు, ఉపాధి కోసం వచ్చినవారు కూడా తమ సొంత ఊర్లకు బయలుదేరుతున్నారు. దీంతో హైదరాబాద్ నగరం ఖాళీ అయిపోతోంది.
శాసనసభ ఎన్నికలలో సెటిలర్స్ అందరూ హైదరాబాద్లోనే ఉండి బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేశారు. కానీ లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయంలో వారందరూ ఏపీకి వెళ్ళిపోతుండటంతో ఈసారి బిఆర్ఎస్ పార్టీ నష్టపోయే అవకాశం ఉంది. ఇది బీజేపీకి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి లబ్ధి కలిగించవచ్చు.