సజ్జనార్‌ని సస్పెండ్ చేయాలి: జీవన్ రెడ్డి

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టిఎస్‌ఆర్టీసీ ఎండీ వీసి సజ్జనార్‌కి మద్య మొదలైన యుద్ధం ఎన్నికల సంఘం వరకు వెళ్ళింది. ఆర్మూరులో జీవన్ రెడ్డికి చెందిన ‘జీవన్ మాల్‌’ టిఎస్‌ఆర్టీసీకి రూ.2.30 కోట్లు లీజు బకాయిలు చెల్లించనందుకు దానిని స్వాధీనం చేసుకుంటున్నట్లు టిఎస్‌ఆర్టీసీ నోటీస్ ఇచ్చింది. 

దీనిపై జీవన్ రెడ్డి స్పందిస్తూ, కీలకమైన ఎన్నికల సమయంలో తనపై బురద జల్లి బిఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికే వీసి సజ్జనార్‌ టిఎస్‌ఆర్టీసీ అధికారులతో తన షాపింగ్ మాల్‌పైకి దండయాత్ర చేయించారని ఆరోపించారు. ఇందుకు ప్రతిగా ఆయన కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజ్యసభ సీటు ఆశిస్తున్నారని ఆరోపించారు. వీసి సజ్జనార్‌ గతంలో కరోనా సమయంలో, మళ్ళీ ఇప్పుడు టిఎస్‌ఆర్టీసీ ఎండీగా అవినీతికి పాల్పడుతూ భారీగా అక్రమాస్తులు పోగేసుకున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఆస్తులపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఆర్మూరులో తన షాపింగ్ మాల్‌ లీజు బకాయిలు రూ.7.50 కోట్లు చెల్లించేశానని కానీ తాను బకాయిలు చెల్లించలేదన్నట్లు వీసి సజ్జనార్‌ టిఎస్‌ఆర్టీసీ సిబ్బంది ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. వీసి సజ్జనార్‌ సైబరాబాద్ పోలీస్ కమీషనర్‌గా ఉన్నప్పుడే వేలకోట్లు ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఆయన రేవంత్‌ రెడ్డి కనుసన్నలలో పనిచేస్తూ బిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. కనుక టిఎస్‌ఆర్టీసీకి ఎండీగా ఉంటూ రాజకీయాలు చేస్తున్న వీసి సజ్జనార్‌ను తక్షణం సస్పెండ్ చేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.