ఎన్నికల ప్రచారానికి నేడే చివరి రోజు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో లోక్‌సభ 4వ దశ ఎన్నికలకు, ఏపీ శాసనసభ ఎన్నికలకు సోమవారం ఉదయం నుంచి పోలింగ్‌ జరుగబోతున్నందున, ఎన్నికల నియమావళి ప్రకారం ఈరోజు (శనివారం) సాయంత్రంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. 

ఏపీలో 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరుగబోతోంది. రెండు రాష్ట్రాలలో ప్రధాన పార్టీలు ఇతర పార్టీలు గత నెలరోజులుగా ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేశాయి. 

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్స్, రాజ్యాంగం రద్ధు, కేసీఆర్‌ అవినీతి, అక్రమాలు, తమ ప్రభుత్వం కూల్చివేసేందుకు జరుగుతున్న కుట్రలను ప్రస్తావిస్తూ బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను ఎండగట్టింది. ఆగస్ట్ 15లోగా పంట రుణాల మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. 

కాంగ్రెస్‌, బీజేపీ రెండూ దేశానికి, రాష్ట్రానికి ప్రమాదకరమేనంటూ బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. నాలుగు నెలల రేవంత్‌ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ కష్టాలు, కరెంట్ కష్టాలు మొదలైపోయాయని బిఆర్ఎస్ వాదించింది. ఈ ఎన్నికలలో 10-12 సీట్లు ఇచ్చి గెలిపిస్తే రాష్ట్ర, దేశ రాజకీయాలలో చక్రం తిప్పుతానని చెప్పుకుంది. 

కాంగ్రెస్‌, బిఆర్ఎస్ రెండు పార్టీలు అవినీతి పార్టీలే అని బీజేపీ వాదించింది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థల నుంచిఓ బలవంతంగా ‘ఆర్ఆర్ టాక్స్’ వసూలు చేస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదని, ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చినా అదేమీ చేయలేదని బీజేపీ వాదించింది. కనుక బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపిస్తే రాష్ట్రంలోను, దేశంలోనూ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని వాదించిఓంది. 

ఇలా మూడు పార్టీల వాదనలు ప్రజలు విన్నారు కనుక మే 13న తీర్పు చెప్పబోతున్నారు. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కించి, వెంట వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.