పెద్దపల్లి జిల్లాలో ముత్తారం మండలం ఓదేడులో మానేరు నదిపై నిర్మిస్తున్న వంతెన సోమవారం రాత్రి అకస్మాత్తుగా కూలిపోయింది.
ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంటే 2016 ఆగస్ట్ నెలలో రూ.49 కోట్లు వ్యయంతో ఈ వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఓదేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలంలోని గరిమిళ్ళ గ్రామాన్ని కలుపుతూ ఈ వంతెన నిర్మిస్తున్నారు.
కానీ 8 ఏళ్ళు గడిచినా ఇంతవరకు వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. కనుక దానిపై రాకపోకలు సాగడం లేదు. పనివేళలో వంతెన నిర్మాణ కార్మికులు మాత్రం దానిపై పనిచేస్తుండేవారు. కానీ నిన్న రాత్రి వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పిపోయింది.
ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజిలో మూడు పిల్లర్లు క్రుంగిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీని ఎండగడుతోంది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల సమయంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో కాంగ్రెస్, బీజేపీలకు బిఆర్ఎస్ పార్టీని దెబ్బ తీసేందుకు మరో బలమైన అస్త్రం లభించిన్నట్లయింది.
బిఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్లకు ఆశపడటం వలననే ఇటువంటి నాసి రకమైన నిర్మాణాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్, బీజేపీలు వాదించకుండా ఉండవు. కనుక దీని ప్రభావం పెద్దపల్లి బిఆర్ఎస్ అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్ ఒక్కరిపైనే పడుతుందా లేక చుట్టుపక్కల నియోజకవర్గాలలో అభ్యర్ధుల విజయావకాశాలను కూడా దెబ్బ తీస్తుందా? అనేది త్వరలోనే తెలుస్తుంది.