మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం రాజన్న సిరిసిల్లా పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ తన కూతురు కల్వకుంట్ల కవితని జైలు నుంచి విడిపించుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీ బేరమాడుకుంటున్నారు.
కూతురుని విడిపించుకోవడం కోసం ఈ ఎన్నికలలో కరీంనగర్‌తో సహా కొన్ని సీట్లు వదులుకోవడానికి కేసీఆర్ సిద్దంగా ఉన్నారు. కూతురు కోసం కేసీఆర్ కరీంనగర్ బిఆర్ఎస్ అభ్యర్ధి వినోద్ కుమార్‌ని బలిపశువుని చేయడానికి వెనకాడకపోవచ్చు.
పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ముంపు గ్రామాల సమస్యను పట్టించుకొనే లేదు. మళ్ళీ ఎన్నికలు రాగానే ఈ సమస్య గురించి మాట్లాడుతున్నారు.
బండి సంజయ్ రాముడు పేరు చెప్పి రాజకీయాలు చేయడం తప్ప ఎంపీగా ఏం చేశారంటే ఏమీ కనపడదు. హిందూ మతానికి పేటెంట్ తీసుకొన్నట్లు మాట్లాడే బండి సంజయ్ వేములవాడ రాజన్న గుడికి ఒక్క రూపాయి ఇవ్వలేదు.
ఎంత సేపు మతరాజకీయాలు చేయడం తప్ప ఆయనకు మరొకటి తెలీదు. అందుకే శాసనసభ ఎన్నికలలో పోటీ చేస్తే ప్రజలు ఓడగొట్టారు. కానీ మళ్ళీ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దమయ్యారు. కానీ లోక్‌సభ ఎన్నికలలో కూడా మరోసారి ఓటమి తప్పదు,” అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.