తమిళనాడులో సినీ రంగంలో ఉన్నవారిని రాజకీయాలు ఎప్పుడూ ఊరిస్తూనే ఉంటాయి. ఇటీవలే ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాలలో ప్రవేశించబోతున్నట్లు ప్రకటించారు. మరో ప్రముఖ నటుడు విశాల్ కూడా రాజకీయాలలో ప్రవేశించబోతున్నట్లు ఆదివారం చెన్నైలో ప్రకటించారు.
తాను సొంత పార్టీతో 2026 శాసనసభ ఎన్నికలలో తప్పకుండా పోటీ చేస్తానని విశాల్ చెప్పారు. ముందుగా ప్రజల మద్యకు వెళ్ళి తన ఆశయాలు, ఆలోచనలు వారితో పంచుకుంటానని చెప్పారు.
విశాల్ ఇప్పటికే ‘దేవీ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా రాష్ట్రంలోని నిరుపేద విద్యార్దులకు, రైతులకు, వృద్ధులు, ఒంటరి మహిళలకు సాయం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ తన సినిమా షూటింగ్ జరిగినా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అక్కడకు రప్పించి వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొంటున్నారు.
త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల కష్ట సుఖాలను స్వయంగా చూసిన తర్వాత వారి అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొంటానని విశాల్ చెప్పారు.
ఇతర పార్టీలతో పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడటం చాలా తొందరపాటే అవుతుందని, రాబోయే రోజుల్లో భావ సారూప్యత కలిగిన పార్టీలను, నాయకులను కలుపుకుపోతానని విశాల్ చెప్పారు.