భద్రాచలం బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు జంప్!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆరు నెలల్లోగా కూల్చేస్తామని  లేదా కూలిపోతుందని, అప్పుడు మళ్ళీ కేసీఆర్‌ నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్‌, హరీష్ రావు తరచూ బెదిరించేవారు. 

రేవంత్‌ రెడ్డి కేవలం 65 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేయగా, బిఆర్ఎస్, మజ్లీస్‌ పార్టీలకు కలిపి 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీలో నుంచి ఓ 10-15 మందిని తమవైపు తిప్పుకోగలిగితే రేవంత్‌ రెడ్డిని గద్దె దించేసి తాము అధికారంలోకి రావచ్చని కేసీఆర్‌ భావిస్తుండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

కనుక కేసీఆర్‌కు ఆ అవకాశం ఈయకుండా రేవంత్‌ రెడ్డే ముందుగా పావులు కదిపి దానం నాగేందర్, కడియం శ్రీహరితో పాటు నేడు భద్రాచలం వైసీపి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుని కూడా కాంగ్రెస్‌లోకి ఆకర్షించి కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

దీంతో శాసనసభలో కాంగ్రెస్‌ బలం 64 నుంచి 67కి పెరగగా, బిఆర్ఎస్ బలం 39 నుంచి 36కి తగ్గింది. మరికొంత మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయెందుకు సిద్దంగా ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకొంటున్నారు. కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే, బిఆర్ఎస్ పార్టీయే ఖాళీ అయిపోతుండటం విశేషం.