మొన్న పెద్దన్న అంటూ పొగడ్తలు.. నేడు విమర్శలు!

కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డి ఆయనకు విమానాశ్రయంలో సాదరంగా స్వాగతం, వీడ్కోలు పలికారు. ఆయనతో పాటు అధికారిక కార్యక్రమాలలో కూడా పాల్గొని మీరే మా పెద్దన్న... తెలంగాణ అభివృద్ధికి మీ సహాయ సహకారాలు చాలా అవసరం. గుజరాత్‌ అభివృద్ధి దేశానికే ఆదర్శం,” అంటూ చాలా పొగిడారు. 

కానీ శనివారం తుక్కుగూడా సభలో “గత పదేళ్ళలో మోడీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. పదేళ్ళు గడుస్తున్నా విభజన హామీలలో ఏ ఒక్కటీ అమలుచేయలేదు. కనీసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయహోదా అయినా ఇవ్వలేకపోయారు. 

ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ప్రధాని నరేంద్రమోడీ మాట తప్పారు. మతాలు, ప్రాంతాలు, భాషల పేరుతో చిచ్చు పెడుతూ దేశ ప్రజలను చీల్చారు. ఉత్తర, దక్షిణ భారతం అంటూ దేశాన్ని కూడా రెండుగా చీల్చుతున్నారు. 

ఆనాడు హైదరాబాద్‌కు వరదలొస్తే బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఒక్క రూపాయి తేలేదు. తెలంగాణకు, దేశానికి ఉపయోగపడని ఈ బీజేపీకి, మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్న కిషన్ రెడ్డికి మనం ఎందుకు ఓట్లు వేయాలి? బి‌ఐ‌ఎస్ పార్టీ మాదిరిగా బీజేపీని కూడా బొందపెట్టే వరకు అందరం కలిసి పోరాడుదాము. 

లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ రెంటినీ ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాము. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కనీసం 14 ఎంపీ సీట్లు ఇస్తేనే మేము ఢిల్లీలో పోరాడి రాష్ట్రానికి నిధులు తీసుకు రాగలుగుతాము,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. 

ఇప్పుడు రాహుల్ గాంధీ సమక్షంలో ప్రధాని మోడీ, బీజేపీలపై నిప్పులు చెరిగిన సిఎం రేవంత్‌ రెడ్డి, రేపు ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఇదేవిదంగా మాట్లాడుతారా?అంటే కాదనే చెప్పాలి. 

గతంలో కేసీఆర్‌ కూడా ప్రధాని మోడీ, కేంద్రప్రభుత్వంతో ఇదేవిదంగా ద్వందవైఖరితో వ్యవహరించి తన విశ్వసనీయత పోగొట్టుకున్నారు. అందుకు మూల్యం చెల్లించారు కూడా. 

కనుక సిఎం రేవంత్‌ రెడ్డి కూడా కేంద్రం, ప్రధాని మోడీ గురించి రెండు విధాలుగా మాట్లాడుతుంటే ఆయన కూడా ప్రజల నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది.