శనివారం తుక్కుగూడలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగిన జనజాతర ఎన్నికల సభలో సిఎం రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్పై తీవ్రస్థాయిల్లో విరుచుకుపడ్డారు. “ఇంతకాలం మీ పార్టీ ఎన్నికలలో ఓడిపోయిందని, నువ్వు కాలు విరిగి మంచం మీద ఉన్నావని, నీ కూతురు జైలులో ఉందని జాలితో మేము మీ గురించి పల్లెత్తుమాట అనలేదు. కానీ మా మౌనాన్ని అలుసుగా తీసుకొని పెట్రేగిపోతున్నావు కేసీఆర్.
మొన్న సూర్యపేటలో, నిన్న కరీంనగర్లో మా ప్రభుత్వం గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడావు. మా భాషని తప్పు పట్టే నువ్వు నా వెంట్రుక కూడా మేము పీకలేమంటూ చాలా చిల్లర మాటలు మాట్లాడావు. మా కార్యకర్తలు తలుచుకుంటే మీ ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఊడదీసి కొడతారు జాగ్రత్త కేసీఆర్!
నేను పెద్దలు జానారెడ్డిలాగా సౌమ్యుడిని కాను... నేను రేవంత్ రెడ్డిని! ఈ విషయం గుర్తుంచుకొని మాట్లాడు కేసీఆర్. ఏది పడితే అది మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకొను. అరెస్ట్ చేయించి చర్లపల్లి జైలుకి పంపిస్తా... కబడ్దార్ కేసీఆర్!” అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
కేసీఆర్ మొన్న కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ, “నేను కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లకు ఫోన్ చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి లేకపోతే మీ బుద్ధి ఏమైందర్రా? అని అడిగితే ప్రభుత్వమే మేడిగడ్డ బ్యారేజిలో 50 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేసి ఖాళీ చేసేయమని ఆదేశించిందని ఇంజనీర్లే నాకు చెప్పారు,” అని అన్నారు.
కేసీఆర్ చెప్పిన ఈ మాటలు విన్నప్పుడు ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు తప్పక గుర్తొస్తాయి. “ఇంకా ప్రభుత్వ శాఖలలో కేసీఆర్ నాటిన కలుపు మొక్కలు చాలానే ఉన్నాయి. వాటన్నిటినీ మేము పీకి పడేస్తున్నాము. ముఖ్యంగా విద్యుత్ శాఖలో కొన్ని కలుపు మొక్కలను ఇప్పటికే పీకి పడేశాము. మిగిలిన శాఖలలో కేసీఆర్ నాటిన కలుపు మొక్కలను ఏరేస్తాము,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మేడిగడ్డ బ్యారేజిలో 50 టీఎంసీల నీళ్ళు సముద్రంలోకి వదిలేయాలని ప్రభుత్వం చెప్పిందని కేసీఆర్కు చెప్పిన ఆ ఇంజనీర్లు ఎవరో? తెలీదు కానీ కేసీఆర్ ఈవిధంగా మాట్లాడి వారి ఉద్యోగాలకు ఎసరు పెట్టారని చెప్పక తప్పదు.