కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతకానితనం వల్లనే నీళ్ళ కరువు: కేసీఆర్‌

నేడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన మాజీ సిఎం కేసీఆర్‌ సాగునీరు అందక ఎండిన పంటలను చూసి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. రైతులకు ధైర్యం కోల్పోవద్దని నీళ్ళు ఇచ్చేవరకు మీ తరపున రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడుతామని భరోసా ఇచ్చారు. అనంతరం సిరిసిల్లాలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. 

మేము కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్‌ జిల్లాకు నాలుగు జీవధారాలైన నీటి వనరులను ఏర్పాటు చేసి ఇక ఎన్నటికీ త్రాగుసాగు నీటికి కరువు లేకుండా చేస్తే, ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నీటి నిర్వహణ చాతకాక నాలుగు నెలలకే చేతులెత్తేసి పంటలు ఎండబెట్టించేసింది. 

మేము అధికారంలో ఉన్నన్నాళ్లు నీటికి కరువు లేకుండా కాలువలలో పారించాము. జలాశయాలు నిండు కుండల్లా తొణికిసలాడేవి. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ఇంత కరువు వచ్చింది. ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువే తప్ప ప్రకృతి సృష్టించిన కరువు కాదు. 

నీళ్ళతో బాటు కరెంటు కూడా ఇవ్వలేకపోవడంతో బోరుబావులున్నా తోడుకొని పంటలను కాపాడుకోలేని దుస్థితి ఏర్పడింది. ఈ నాలుగు నెలల్లో 209 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినా ఉలుకు పలుకూ లేదు. 

గతంలో మేము రైతులకు రైతుబంధు, రైతు భరోసా ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ఊసే లేదు. ఇస్తారో లేదో ఇస్తే ఎప్పుడు ఇస్తారో ఎవరికీ తెలియదు. ఇంట్లో ఇద్దరికీ నెలకు రూ.4,000 పింఛన్ ఇస్తామన్నారు. దళితబంధు రూ.12 లక్షలు ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి పధకంలో తులం బంగారం కూడా ఇస్తామన్నారు. ఇంకా నోటికి వచ్చిన్నట్లు అనేక హామీలు ఇచ్చారు. అవన్నీ ఎప్పుడు ఇస్తారో తెలీదు.

మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రాగలిగారు. కానీ ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎవరికీ ఏదీ చాతకావట్లేదు. మేడిగడ్డ బ్యారేజిలో రెండు పిల్లర్లు క్రుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు అంతా దెబ్బ తిందన్నట్లు దుష్ప్రచారం చేస్తూ నాపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అవతల రైతులు నష్టపోతున్నా పట్టించుకోవడం లేదు. ఇందుకేనా మీకు అధికారం కట్టబెట్టింది? తక్షణం నీళ్ళు విడుదల చేయకపోతే 50 వేలమంది రైతులతో వెళ్ళి మేడిగడ్డ బ్యారేజి గేట్లు ఎత్తి మేమే నీళ్ళు తెచ్చుకుంటాము. ఇందుకోసం దేనికైనా నేను సిద్దం,” అని కేసీఆర్‌ తీవ్రంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.