తెలంగాణ మాజీ సిఎం, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేడు కరీంనగర్, రాజన్న సిరిసిల్లా జిల్లాలలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి బస్సులో బయలుదేరి ముందుగా కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం, రూరల్ మండలాలోని సాగునీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు.
అనంతరం బిఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజనం చేసి అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత రాజన్న సిరిసిల్లా జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గంలో ఎండిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు.
సిరిసిల్లా పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో కేసీఆర్ ఓ కీలకప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. సమావేశం ముగిసిన తర్వాత తిరిగి బస్సులో ఎర్రవెల్లి చేరుకుంటారు.
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో కేసీఆర్ మళ్ళీ ఈవిదంగా ప్రజల మద్యకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుండటంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
కేసీఆర్ పర్యటనలలో సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను మీడియా ద్వారా ప్రజలకు చూపించి, తన హయాంలో 365 రోజులు నీళ్ళు ఇచ్చామని కానీ మీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోందని గట్టిగా నిలదీస్తుండటంతో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీపై వ్యతిరేకత పెరుగుతుందని, అది లోక్‌సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.