కల్వకుంట్ల కవితకు మళ్ళీ నిరాశే

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ప్రస్తుతం ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ ప్రయత్నాలు ఫలించలేదు. ఈరోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఆమె పిటిషన్‌పై ఇరుపక్షాల న్యాయవాదులు సుదీర్గంగా వాదనలు వినిపించారు.

ఈడీ తరపు న్యాయవాది ఆమెకు ఎట్టి పరిస్థితులలో బెయిల్‌ మంజూరు చేయవద్దని కోరారు. ఆమె రాజకీయంగా చాలా పలుకుబడి గల కుటుంబానికి చెందినవారు కనుక సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తారని వాదించారు.

ఈ కేసులో అప్రూవరుగా మారిన ఓ వ్యక్తిని ఆమె ఫోన్లో బెదిరించారని కోర్టుకు తెలియజేశారు. దీనికి సంబందించి కొన్ని ఆధారాలను జడ్జికి సమర్పించారు. 

ఆమె ఈ కేసులో ఈడీకి ఏమాత్రం సహకరించడం లేదని, పైగా కేసుకి సంబందించిన సాక్ష్యాధారాలన్నీ తన మొబైల్ ఫోన్లలో నుంచి చెరిపేసి వాటిని తమకు అప్పగించారని న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్ళారు. కనుక కొడుకు పరీక్షల పేరుతో బెయిల్‌ కోరి విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, కనుక ఆమెకు బెయిల్‌ మంజూరు చేయవద్దని ఈడీ తరపు న్యాయావాది వాదించారు. 

ఆమె తరపు న్యాయవాది వాదనలు కూడా విన్న తర్వాత ఈ కేసులో తీర్పుని రిజర్వ్ చేస్తున్నామని, సోమవారం తదుపరి విచారణలో తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి చెప్పారు. దీంతో ఈసారి కూడా కల్వకుంట్ల కవిత బెయిల్‌ ప్రయత్నం విఫలమైంది. మళ్ళీ సోమవారం వరకు అంటే మరో నాలుగు రోజులు ఎదురుచూడక తప్పదు.