బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు లీగల్ నోటీస్ పంపించడంపై మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నేను మీడియాలో వచ్చిన కధనాలు, అరెస్ట్ అయిన ప్రణీత్ రావు తదితర పోలీస్ ఆఫీసర్లు బయట పెట్టిన విషయాల ఆధారంగా నా ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగి ఉండవచ్చనే అనుమానంతో డిజిపికి ఫిర్యాదు చేశాను.
అయినా అరెస్ట్ అయిన పోలీస్ అధికారులే మీ తండ్రిగారి ఆదేశాలతో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశామని చెపుతున్నారు కదా?వారికి కూడా లీగల్ నోటీస్ పంపిస్తారా?కనుక లీగల్ నోటీసులు పంపించి నన్ను బెదిరించాలని ప్రయత్నించొద్దు.
లీగల్ నోటీసులు పంపించాలనే కాంగ్రెస్ పార్టీ కూడా మీకు పంపించలేదా? సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో వసూలు చేసిన రూ.2,500 కోట్లు ఢిల్లీకి పంపించారని మీరు అన్నందుకు మేము కూడా లీగల్ నోటీసులు పంపించలేమా? మునుగోడు ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ నేతలు చేసిన అక్రమాలు, దౌర్జన్యాల గురించి మాకు తెలియవా?వాటిపై మేము కేసులు వేస్తే మీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోండి.
అయినా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో మీకు సంబంధం లేదని చెప్పుకొంటున్నప్పుడు ఎవరో ఏదో అంటే ఆందోళన చెంది లీగల్ నోటీసులు పంపించడం దేనికి?ఇలా ఎంతమందికి నోటీసులు పంపిస్తారు? ఎంతమందితో న్యాయపోరాటాలు చేస్తారు?” అని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.