ఆదాయానికి మించి ఆస్తులు కలిగినందుకు అక్రమాస్తుల కేసులో ఈ ఏడాది జనవరి 25న అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
రెండు లక్షల రూపాయలు విలువగల పూచీకత్తు సమర్పించాలని, ఈ కేసు విచారణ పూర్తయ్యేవరకు పోలీసుల అనుమతి లేనిదే దేశం విడిచి బయటకు వెళ్ళరాదని, అందుకుగాను పాస్‌పోర్టుని పోలీసులకు అప్పజెప్పాలని, అలాగే ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని కోర్టు ఆదేశించింది.
ఇదే కేసులో అరెస్ట్ అయిన ఆయన సోదరుడు శివ నవీన్‌కు కూడా కోర్టు ఇవే షరతులతో బుధవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారిరువురూ నేడు జైలు నుంచి విడుదల కానున్నారు.
అయితే వారికి బెయిల్ మంజూరు కావడానికి ఏసీబీ అధికారులే కారణం కావడం విశేషం. ఓ వ్యక్తిని ఏదైనా కేసులో అరెస్ట్ చేసినప్పుడు చట్టప్రకారం 60 రోజులలోగా ఆ వ్యక్తిపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ ఏసీబీ అధికారులు సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో శివబాలకృష్ణ, శివ నవీన్ ఇద్దరూ కోర్టుని ఆశ్రయించగా వారికి బెయిల్ మంజూరు చేసింది. అప్పుడు ఏసీబీ అధికారులు హడావుడిగా పిటి వారెంట్ దాఖలు చేయబోతే కోర్టు తిరస్కరించింది.
శివబాలకృష్ణ అక్రమస్తుల కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంత కీలకమైన కేసులో సాక్ష్యాధారాలతో సహా పట్టుబడ్డ శివబాలకృష్ణ అరెస్ట్ అయిన రెండున్నర నెలల్లోగా బెయిల్‌పై బయటకు వచ్చేస్తున్నారంటే ఏమనుకోవాలి?