తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈరోజు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని కాంగ్రెస్ మంత్రులే ఆరోపిస్తున్నారు. కానీ ఈ కేసులో దోషులను పట్టుకొని శిక్షించాలంటే ఈ కేసుని సీబీఐకి అప్పగించాలి. లేకుంటే ఈ కేసు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్ కేసుల విచారణలాగే సాగుతుంటుంది.
కానీ కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే టామ్ అండ్ జెర్రీ షోని తలపిస్తోంది. ఎవరు ఈ నేరానికి పాల్పడ్డారో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. కానీ పట్టుకొనే ధైర్యం లేదు. ఈ విషయం బిఆర్ఎస్ పార్టీకి కూడా తెలుసు. అందుకే ఎదురు సవాలు విసురుతోంది. సిఎం రేవంత్ రెడ్డికి ఈ కేసులో దోషులకు శిక్షపడాలనే చిత్తశుద్ధి ఉన్నట్లయితే తక్షణం ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని కోరుతున్నాను,” అని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత అరెస్టు గురించి మాట్లాడుతూ, “ఈ కేసులో ఆమె నేరం చేశారనే బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందునే న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేయలేదని భావిస్తున్నాను. ఆమె మద్యం కుంభకోణం చేసి జైలుకి వెళితే దానికీ బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఈడీ, సీబీఐ విచారణలో కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ కలుగజేసుకోదు,” అని లక్ష్మణ్ అన్నారు.