వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్ళిన తెలంగాణ మాజీ ఇంటలిజన్ చీఫ్ ప్రభాకర్ రావు బుధవారం హైదరాబాద్ తిరిగివస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ఆయన కనుసన్నలలోనే నడిచిందని భావిస్తున్న పోలీసులు ఈ కేసులో ఆయన పేరుని ఏ-1గా చేర్చారు.
ఈ విషయం తెలుసుకున్న ఆయన నాలుగైదు రోజుల క్రితం అమెరికా నుంచి మీడియాతో మాట్లాడుతూ, “నేను ఎటువంటి తప్పు చేయలేదు. ఎటువంటి తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడతాను?పదవీ విరమణ చేసిన తర్వాత నేను వైద్య చికిత్స కోసం అమెరికా వచ్చాను. ఇక్కడ చికిత్స పూర్తయిన తర్వాత జూన్-జూలై నెలల్లో హైదరాబాద్ తిరిగివస్తాను. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరుపుతున్న పోలీసులకు నేను పూర్తిగా సహకరిస్తాను,” అని చెప్పారు.
జూన్-జూలై నెలల్లో తిరిగి వస్తానని చెప్పిన ప్రభాకర్ రావు, హైదరాబాద్ తిరిగివస్తే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారని తెలిసి ఉన్నప్పటికీ ఇంత త్వరగా తిరిగి వస్తుండటం చాలా ఆశ్చర్యకరమే. పోలీసులు ఆయన కోసమే ఎదురు చూస్తున్నారు కనుక రాగానే అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించడం ఖాయమే.
ఆయన ఇంటలిజన్స్ అధినేతగా పనిచేశారు కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక ఎవరెవరున్నారు? ఎవరి ఆదేశాలతో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, బంగారు ఆభరణాల వ్యాపారుల ఫోన్లను ట్యాపింగ్ చేశారు? వారి నుంచి ఎటువంటి సమాచారం, ఎంత డబ్బు రాబట్టారు?వంటి అన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల దారా పోలీసులు కీలక సమాచారం, సాక్ష్యాధారాలు సేకరించారు. వారిలో భుజంగరావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించగా తిరుపతన్న నియోజకవర్గాలకు పోలీస్ వాహనాలలో డబ్బు తరలించేవారని పోలీసులు కనుగొన్నారు. వీరిద్దరూ ప్రణీత్ రావుతో కలిసి పనిచేసేవారని కనుగొన్నారు.