కేసీఆర్‌ నా సలహా పెడచెవిన పెట్టారు అందుకే... కడియం

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ, “నాకు కేసీఆర్‌, హరీష్ రావు, కేటీఆర్‌ అంటే చాలా గౌరవం ఉంది. కనుక వారు నాపై చేసే విమర్శలకు బదులివ్వను. కానీ వారికి ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. నా సహనానికి కూడా హద్దు ఉంటుంది. కనుక పదేపదే నన్ను రెచ్చగొట్టి నా నోటితో మీ బండారం బయటపెట్టించుకోవద్దు.

పార్టీని బలోపేతం చేసుకోవాలని, లేకుంటే నష్టపోతామని నేను కేసీఆర్‌కు చాలాసార్లు చెప్పాను. చివరికి అదే జరిగింది. కనీసం రెండో సారి బిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా పార్టీ నిర్మాణంపై శ్రద్ద పెట్టి ఉండి ఉంటే నేడు ఈ దుస్థితి ఎదురయ్యేదే కాదు.

ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత పార్టీ నిర్మాణంపై కాస్త దృష్టి పెట్టారు కానీ మళ్ళీ రాజకీయాలకే పరిమితం అవుతున్నారు. కనుక కేసీఆర్‌ తీరు మారకపోతే రాష్ట్రంలో బిఆర్ఎస్‌ పార్టీ కనబడకుండా పోతుంది,” అని అన్నారు. 

ఈ సందర్భంగా కడియం శ్రీహరి బీజేపీ గురించి కూడా మాట్లాడటం విశేషం. “బీజేపీ రాష్ట్రంలోకి మళ్ళీ దూసుకువస్తోంది. అటువంటి మతతత్వపార్టీని ప్రజలందరూ కలిసి అడ్డుకోకపోతే అది రాష్ట్రంలో భిన్నమతాలు, వర్గాల ప్రజల మద్య చిచ్చు పెడుతుంది. అది బిఆర్ఎస్‌ పార్టీని తుడిచిపెట్టేసి రాష్ట్రంలో బలపడాలని ప్రయత్నిస్తోంది.

బీజేపీ విధానాలు తెలంగాణ రాష్ట్రానికి చాలా ప్రమాదకరం. కనుక లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని ఓడించాలని నేను రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని కడియం శ్రీహరి అన్నారు.