షర్మిల, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరితో వైసీపీకి చాలా కష్టమే

ఈసారి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగబోతున్నాయి. వైఎస్ షర్మిల తెలంగాణలో చేసిన రాజకీయ ప్రయోగం విఫలం అవడంతో కాంగ్రెస్‌ ఇచ్చిన స్నేహహస్తం అందుకొని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా లాటరీ కొట్టారు. 

ఆమె తన అన్న జగన్మోహన్‌ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటంతో ఏపీ రాజకీయాలలో కొత్త అధ్యాయం మొదలైంది. ఆమె కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధిగా కడప నుంచి పోటీ చేయబోతున్నారు కూడా. 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడి నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఆయనకు అండగా జగన్‌, వైసీపి సైన్యం నిలుస్తుంటే, వైఎస్ షర్మిలకు అండగా వివేకా కుమార్తె సునీతా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నిలుస్తోంది. కనుక కడపలో అన్నా చెల్లెళ్ళ మద్య భీకర యుద్ధం జరుగబోతోంది. 

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ గత ఎన్నికలలో రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈసారి ఆయన ఈసారి కాకినాడ జిల్లాలోని పిఠాపురం ఒక్క చోట నుంచే శాసనసభకు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పవన్‌ కళ్యాణ్‌ కులసమీకరణాల లెక్కలు బాగానే నేర్చుకొని తదనుగుణంగా దూసుకుపోతున్నారు. 

కనుక ఎట్టి పరిస్థితులలో పవన్‌ కళ్యాణ్‌ని ఓడించి ఆయన రాజకీయ జీవితానికి, జనసేన పార్టీకి కూడా ముగింపు పలకాలని జగన్మోహన్‌ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక ఆ ఒక్క నియోజకవర్గంలోనే సుమారు రూ.100-150 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్దమయ్యారని పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా చెప్పారు. 

అంతేకాదు... అభిమానులమని చెప్పుకొంటూ కొందరు తనతో ఫోటోలు దిగేందుకు వచ్చివెళుతున్నప్పుడు, బ్లేడ్‌తో తనను, తన సిబ్బందిని, గాయపరిచి జనంలో కలిసి మాయం అయిపోతున్నారని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. కనుక పార్టీ అభ్యర్ధులు, నేతలు, కార్యకర్తలు అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించారు. కనుక ఆయన ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో పోటీ చేయబోతున్నారో ఊహించుకోవచ్చు. 

ఈసారి ఎన్నికలలో వైసీపి ఒక్కటీ ఒకవైపు, టిడిపి, జనసేన, బీజేపీల కూటమి మరోవైపు నిలిచి పోటీ పడుతున్నాయి. ఈసారి టిడిపి, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సర్వేలు సూచిస్తున్నాయి. మే 13వ తేదీన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు జరుగబోతున్నాయి. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.