సుమారు రెండున్నర దశాబ్ధాలపాటు తెలంగాణ రాజకీయాలను కంటిచూపుతో శాశించిన మాజీ సిఎం కేసీఆర్‌కు, ఒకే ఒక్కసారి ఎన్నికలలో ఓడిపోవడంతో కష్టాలు చుట్టుముట్టాయి. ఆ కష్టాల జాబితా అందరికీ తెలుసు. తాజాగా ఆయన కుటుంబానికి మరో కొత్త కష్టం వచ్చింది.
భూకబ్జా కేసులో కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుని ఆదిభట్ల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మన్నెగూడ పరిధి సర్వే నంబర్ 32లో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన 2.15ఎకరాల భూమిని కల్వకుంట్ల కన్నారావు, అనుచరులతో కలిసి కబ్జాకు ప్రయత్నించింది.
ఆ సంస్థ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు ఆదిభట్ల పోలీసులు కల్వకుంట్ల కన్నారావుతో సహా మొత్తం 38 మందిపై సెక్షన్స్ 147, 148, 447, 427, 307, 436, 506 రెడ్ విత్ 149 కింద కేసు నమోదు చేశారు. వారిలో కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కల్వకుంట్ల కన్నారావు, జక్కిడి సురేందర్‌రెడ్డి, జక్కిడి హరినాథ్, శివ, డేనియెల్ ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు.
ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేయగా కల్వకుంట్ల కన్నారావుతో సహా మిగిలినవారు పరారీలో ఉన్నారు. కల్వకుంట్ల కన్నారావు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ హైకోర్టు తిరస్కరించడంతో ఆయన అజ్ఞాతంలో ఉన్నారు.
ఆయన సింగపూర్ పారిపోయిన్నట్లు అనుమానించిన ఆదిభట్ల పోలీసులు లుక్ అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు. ఎట్టకేలకు ఆయనను మంగళవారం అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపటిలో జిల్లా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యి ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికే చెందిన మరొకరు అరెస్ట్ అవడంతో కల్వకుంట్ల కుటుంబం పరువు బజారున పడుతోంది.