కాంగ్రెస్‌ నేతలకు కేటీఆర్‌ లీగల్ వార్నింగ్

బిఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికలలో ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారంపై పలువురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి ఓ పక్క విచారణ చేస్తుండగానే, మరోపక్క దీనిపై కాంగ్రెస్‌, బిఆర్ఎస్‌ల మద్య రాజకీయ యుద్ధం కూడా మొదలైంది. 

మహబూబ్ నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్ నేత కె. మహీందర్ రెడ్డి ఇద్దరూ బిఆర్ఎస్‌ హయాంలో తమ ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని, దీని వెనుక ఆనాడు ఐ‌టి, మునిసిపల్ మంత్రిగా చేసిన కేటీఆర్‌ ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నామని హైదరాబాద్‌ నగర పోలీస్ కమీషనర్‌గా కొత్తకోట శ్రీనివాస రెడ్డికి ఫిర్యాదు చేశారు. మంత్రి కొండా సురేఖ కూడా ఇటువంటి ఆరోపణలే చేశారు.

ఆమె సోమవారం వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రముఖ హీరోయిన్‌, మనస్పర్ధాలతో విడిపోయిన  మరో టాలీవుడ్‌ జంట ఫోన్లు, మరి కొందరు సినీ ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని ప్రణీత్ రావు విచారణలో తేలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన్నట్లే, ఈ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో కేసీఆర్‌, కేటీఆర్‌ కూడా అరెస్ట్ అవడం ఖాయమే,” అని కొండా సురేఖ అన్నారు.

వీటిపై కేటీఆర్‌ స్పందిస్తూ, “ఈ ఇద్దరు కాంగ్రెస్‌ నేతలతో సహా ఆ మంత్రిగారికి కూడా నేను లీగల్ నోటీసులు పంపించబోతున్నాను. నాపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు వారు ముగ్గురూ తక్షణమే నాకు క్షమాపణలు చెప్పాలి. లేకుంటే వారిపై నేను తీసుకోబోయే చట్టపరమైన చర్యలను ఎదుర్కునేందుకు సిద్దంగా ఉండాలి.

వీరితో పాటు ఈ చెత్త వ్యవహారాన్ని నాకు ముడిపెడుతూ నిరాధారమైన వార్తలు ప్రచురిస్తున్న మీడియా సంస్థలకు కూడా నేను నోటీస్ పంపించబోతున్నాను,” అని ట్విట్టర్‌లో హెచ్చరిస్తూ, ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ‘డెక్కన్ క్రానికల్’లో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను కూడా జత చేశారు.