బిఆర్ఎస్ పార్టీని ఎందుకు వీడానంటే... కడియం శ్రీహరి

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం బిఆర్ఎస్‌ పార్టీని వీడిన తర్వాత హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “బిఆర్ఎస్ పరిస్థితి చూసి ఆ పార్టీలో పలువురు నాయకులు అయోమయంలో ఉన్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలువురు పార్టీని వీడి వెళ్ళిపోయారు. మిగిలినవారి మద్య సయోధ్య లేదు. కనుక వరంగల్‌ నా కూతురు కావ్యకు వారి సహకారం లభించడం లేదు. ఇటువంటి పరిస్థితులలో ఎన్నికలలో గెలవడం అసాధ్యం. నా కూతురు మొదటిసారిగా ఎన్నికలలో పోటీ చేస్తోంది. కనుక ఓడిపోయే పార్టీ తరపున పోటీ చేయడం ఇష్టం లేకనే తప్పుకుంది. 

అక్కడ నుంచి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ కూడా పోటీ చేయడానికి నిరాకరించి బీజేపీలో చేరిపోయారు. ఆయన వద్దని వెళ్ళిపోయారు కనుకనే ఆ సీటు కేసీఆర్‌ మాకు ఇచ్చారు తప్ప మా మీద అభిమానం, గౌరవంతో కాదు. 

పదేళ్ళు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీలోనే నేను కూడా ఉన్నప్పటికీ, నేను ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇబ్బందిపడుతూ అంటిపెట్టుకొని ఉన్నాను. నా నియోజకవర్గానికి నన్ను దూరంగా ఉంచుతూ ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరి నా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటాను.

నేను రాజయ్య తదితర నేతల్లాగ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎవరి చుట్టూ తిరగలేదు. కడియం శ్రీహరి నేతలే నా ఇంటికి వచ్చి పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానిస్తే చేరుతున్నాను.

 ప్రతీసారి ఇటువంటి అవకాశాలు రావు. వచ్చినప్పుడు అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళకపోతే మనమే నష్టపోతాము. నేను పార్టీ వీడగానే నాపై బిఆర్ఎస్‌ నేతలు అప్పుడే విమర్శలు మొదలుపెట్టేశారు. నేను ఏనాడూ అవినీతికి పాల్పడలేదు. కాంట్రాక్టులు చేయలేదు. కమీషన్లు దండుకోలేదు. కాలేజీలు ఏర్పాటు చేసుకోలేదు. కనుక నేను కేసీఆర్‌, బిఆర్ఎస్‌ పార్టీలకు జవాబు చెప్పుకోవలసిన అవసరం లేదు. నా నియోజకవర్గం ప్రజలకు మాత్రమే నేను జవాబుదారీని. త్వరలోనే నియోజకవర్గంలో పర్యటించి ప్రజలకు అన్నీ వివరిస్తాను,” అని కడియం శ్రీహరి అన్నారు.