కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని కోరేందుకు శనివారం ఉదయం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభలోస్పీకర్ గడ్డం ప్రసాద్‌కు పిటిషన్ ఇచ్చేందుకు వెళ్ళారు.
కానీ ఆయన లేకపోవడంతో శాసనసభ కార్యదర్శిని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన కూడా అందుబాటులో లేకపోవడంతో, డెప్యూటీ స్పీకర్‌ని కలిసి పిటిషన్ ఇవ్వబోయారు. కానీ ఆయన నిరాకరించడంతో ఇక చేసేదేమీ లేక వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు.
అయితే బిఆర్ఎస్ పార్టీ ఎంత ఒత్తిడి చేసినప్పటికీ, స్పీకర్ వాటిని ఆమోదించే అవకాశం లేదనే భావించవచ్చు. గతంలో కాంగ్రెస్, టిడిపి ఎంయల్యేలను బిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయింపజేసుకున్నప్పుడు, ఆ రెండు పార్టీలు కూడా ఇలాగే స్పీకర్ చుట్టూ తిరిగాయి. కానీ స్పీకర్ పట్టించుకోలేదు. కనుక ఇప్పుడూ అలాగే జరుగుతుంది.
ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ బలం 67కి పెరుగగా, బిఆర్ఎస్ పార్టీ బలం 37కి తగ్గింది. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికిప్పుడు వారిని చేర్చుకుంటే లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీని విమర్శించే అవకాశం కల్పించిన్నట్లవుతుందని, కనుక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా కాంగ్రెస్ నేతలు వారికి సూచించిన్నట్లు తెలుస్తోంది.
కనుక ఇప్పుడు కడియం, దానంలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కూడా కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. దాదాపు 15 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి నిజమో కాదో రాబోయే రోజుల్లో చూడవచ్చు.